సీనియర్ ప్లేయర్ హోటల్ గదిలో భర్త.. కెప్టెన్ ఫాతిమా సనా గుస్సా.. పాక్ మహిళల జట్టులో రచ్చరచ్చ

  • వరల్డ్ కప్‌లో పాక్ మహిళల జట్టు దారుణ ప్రదర్శన
  • కెప్టెన్ ఫాతిమా సనా, మెంటార్ వహాబ్ రియాజ్ మధ్య విభేదాలు
  • సీనియర్ ప్లేయర్ భర్త హోటల్ గదిలో ఉండటంపై చెలరేగిన వివాదం
  • జట్టులో గ్రూపులు, కోచ్‌ల పట్ల ఆటగాళ్లలో అసంతృప్తి
  • నిరంతరం కోచ్‌ల మార్పుతో అస్థిరంగా మారిన పాక్ మహిళల టీమ్‌
ఇంగ్లండ్‌లో జరుగుతున్న మహిళల టీ20 ప్రపంచకప్‌లో పాకిస్థాన్ జట్టు తీవ్ర సంక్షోభంలో కూరుకుపోయింది. ఒకవైపు మైదానంలో వరుస ఓటములతో సతమతమవుతుంటే, మరోవైపు జట్టులో అంతర్గత విభేదాలు, గొడవలు తారస్థాయికి చేరినట్లు కథనాలు వెలువడుతున్నాయి.

ఈ టోర్నమెంట్‌లో ఆడిన నాలుగు మ్యాచ్‌లలోనూ ఓటమిపాలైన పాక్ జట్టు, కెప్టెన్-కోచ్ మధ్య ఆధిపత్య పోరుతో సతమతమవుతోంది. ఈ ఆరోపణలను పాకిస్థాన్ క్రికెట్ బోర్డు (పీసీబీ) అధికారికంగా ధ్రువీకరించకపోయినా, సోషల్ మీడియా, మెయిన్‌స్ట్రీమ్ మీడియాలో వస్తున్న కథనాలు జట్టులోని గందరగోళ పరిస్థితులను స్పష్టం చేస్తున్నాయి.

జట్టు మెంటార్ వహాబ్ రియాజ్‌కు, కెప్టెన్ ఫాతిమా సనాకు మధ్య సెలక్షన్ విషయాల్లో తీవ్రమైన భేదాభిప్రాయాలు తలెత్తిన్న‌ట్లు స‌మాచారం. బంగ్లాదేశ్‌తో మ్యాచ్‌కు ముందు ఈ వివాదం మరింత ముదిరింది. సీనియర్ ప్లేయర్ ఆలియా రియాజ్ భర్త, ఆమెతో పాటు టీమ్ హోటల్‌ గదిలో ఉండటాన్ని కెప్టెన్ ఫాతిమా సనా తీవ్రంగా వ్యతిరేకించింది. ఆమె పట్టుబట్టడంతో ఆలియా భర్త అలీ యూనిస్‌ను గది ఖాళీ చేయమని యాజమాన్యం కోరింది. అయితే, దీని తర్వాత బంగ్లాదేశ్‌తో మ్యాచ్‌కు ముందు, జట్టు ప్రాక్టీస్ షెడ్యూల్ ఉన్నప్పటికీ ఆలియా, ఆమె భర్త సరదాగా షికారుకు వెళ్లడం వివాదాన్ని మరింత పెంచింది.

దీంతో క్రమశిక్షణ ఉల్లంఘన కింద ఆలియాను బంగ్లాదేశ్‌తో మ్యాచ్ నుంచి తప్పించాలని ఫాతిమా పట్టుబట్టింది. అయితే, మెంటార్ వహాబ్ రియాజ్ మాత్రం ఆమెను తుది జట్టులో కొనసాగించాలని పట్టుబట్టారు. చివరికి వహాబ్ మాటే నెగ్గింది. కానీ, ఆ మ్యాచ్‌లో ఆలియా విఫలమవగా, పాకిస్థాన్ ఓటమిపాలైంది. మ్యాచ్ అనంతరం అందరి ముందే ఫాతిమా సనా.. వహాబ్‌ను నిలదీసింది. క్రమశిక్షణ నిబంధనలను పాటించకపోవడం వల్లే ఓటమి ఎదురైందని, దీనికి మీరే బాధ్యత వహించాలని స్పష్టంగా చెప్పినట్లు తెలుస్తోంది.

ఈ ఒక్క ఘటనే కాకుండా జట్టులో సీనియర్ ఆటగాళ్ల మధ్య గ్రూపులు ఏర్పడ్డాయని, కోచ్‌లు, ఆటగాళ్ల మధ్య సంబంధాలు దెబ్బతిన్నాయని కూడా కథనాలు వస్తున్నాయి. తాము ఇచ్చిన ప్రణాళికలను ఆటగాళ్లు మైదానంలో అమలు చేయడం లేదని కోచ్‌లు తీవ్ర అసంతృప్తితో ఉన్నట్లు సమాచారం.

పాకిస్థాన్ క్రికెట్‌లో ఇలాంటి ఘటనలు కొత్తేమీ కాదు. 2023, 2024 పురుషుల ప్రపంచకప్‌లలో జట్టు విఫలమైనప్పుడు కూడా డ్రెస్సింగ్ రూమ్‌లో ఇలాంటి వాతావరణమే ఉందని వార్తలొచ్చాయి. గత 3-4 ఏళ్లుగా మహిళల జట్టుకు మార్క్ కోల్స్, జునైద్ ఖాన్, బాసిత్ అలీ, సలీమ్ జాఫర్ వంటి ఎందరో కోచ్‌లను పీసీబీ నిరంతరం మారుస్తూనే ఉంది. ఈ అస్థిరతే జట్టు ప్రదర్శనపై తీవ్ర ప్రభావం చూపుతోందని విశ్లేషకులు అభిప్రాయపడుతున్నారు. వరుస ఓటములు, అంతర్గత గొడవలతో పాక్ మహిళల జట్టు పతనం అంచున నిలిచింది.

Fatima Sana
Pakistan Women Cricket Team
Aliya Riaz
Wahab Riaz
T20 World Cup 2024
Internal Rift

More Telugu News